కరోనా నుంచి కోలుకున్న మహిళా ఉద్యోగి.. ఊహించని షాకిచ్చిన ఇంటి యజమాని

రోనా వైరస్‌ (కోవిడ్ 19) మహమ్మారి నుంచి కోలుకుని సగర్వంగా ఇంటికి చేరుకున్న ప్రభుత్వ ఉద్యోగురాలికి ఆ ఇంటి యజమాని ఊహించని షాకిచ్చారు. కరోనాను జయించాననే ఆనందం కాసేపైనా లేకుండానే ఆమెను నడిరోడ్డుపై నిలబెట్టాడు. కనీస జాలి, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకి వెళ్లగొట్టాడు. ఈ అమానవీయ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.


శ్రీకాళహస్తి తహశీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వరిస్తున్న ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను ఆస్పత్రికి చేర్చి కరోనా చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆమె డిశ్చార్జి అయ్యి తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకుంది.

అయితే ఆ మహిళను ఇంటి యజమాని అడ్డుకున్నాడు. ఆమె అద్దెకుంటున్న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగొట్టాడు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో పాలుపోక నడిరోడ్డుపై సదరు మహిళ నిల్చునే పరిస్థితి ఏర్పడింది. అయితే తమ సహోద్యోగి పరిస్థితి తెలుసుకున్న శ్రీకాళహస్తి తహశీల్దారు ఆమెకు వేరొకచోట బస ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్థానికులు మహిళా ఉద్యోగికి అండగా నిలిబడగా, ఇంటి యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు